Questiones & Answers

17/10/2010 06:59

1. నా భార్య ప్రసవించి యున్నందున నేను వినియోగించుకుంటున్న ప్యాటర్నటీ సెలవు 10.10.2010తో ముగుస్తుంది. 7, తేదీనుండి దసరా సెలవులు గనుక నేను పాఠశాల విధులలో ఎప్పుడు చేరాలి? పి.రాజశేఖర్‌, జహీరాబాద్‌, మెదక్‌జిల్లా.

అర్హతగల సెలవును వెకేషన్‌తో గాని, పబ్లిక్‌ సెలవుతో గాని జతపరచి వాడుకొనవచ్చు. అయితే దసరా/సంక్రాంతి సెలవులు పబ్లిక్‌ సెలవులు కాదు, వెకేషన్‌ కూడా కాదు. అందుచే ప్యాటర్నటీ సెలవులోనున్న మీరు సెలవుల ప్రారంభమునకు ముందురోజు అనగా 6.10.2010 సాయంత్రము విధులలో చేరవలసి వుంటుంది. లేనిచో 11.10.2010 నుండి దసరా సెలవులు ముగింపు తేదీ:18.10.2010 వరకు అర్హతగల సెలవు మంజూరుకై దరఖాస్తు చేసుకోవలసి వుంటుంది. ఈ విషయమై పాఠశాల విద్యా సంచాలకులు ఆర్‌.సి.నెం.10324/ జు 4-2/69 తేదీ:7.11.69. ద్వారా ఇచ్చిన వివరణను పరిశీలించండి.

2.మా నాన్న విశాఖ పట్టణం రైల్వేస్టేషన్‌లో టోకెన్‌ పోర్టర్‌గా పనిచేస్తూ 1976లో తలకు దెబ్బ తగిలి మతిస్థిమితం కోల్పోయాడు. మా కుటుంబానికి ఏ రకమైన ఆర్థిక సహాయమూ రైల్వే అధికారులు ఇవ్వలేదు. మా కేమీ పొందే అవకాశం లేదా? బి.సుధాకర్‌, విశాఖపట్టణం.

మీ నాన్న ఉద్యోగం మానేసి 34 సంవత్సరాలు గడిచిన తరువాత, ప్రస్తుతం ఉన్న రైల్వే అధికారులు మీ కుటుంబానికి చేయదగిన సహాయం గురించి స్పందించే అవకాశం తక్కువ. అయినా రైల్వే ఉద్యోగుల/కార్మిక సంఘాలకు చెందిన స్థానిక నాయకుల సహకారంతో రైల్వే అధికారులకు ప్రాతినిధ్యం చేయండి.

3. ఎస్‌జిటిగా పనిచేస్తూ 16 సంవత్సరముల స్కేలు పొందిన నేను దసరా పండుగ సందర్భంగా, పండుగ అడ్వాన్సుకై దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు నా దరఖాస్తును తిరస్కరించారు. సమంజసమేనా? జి.విశాలాక్షి, పార్వతీపురం, విజయనగంజిల్లా.

2010 వేతన సవరణ స్కేళ్లలో ఉద్యోగులకు వివిధ రకాల అప్పులు, అడ్వాన్సుల పరిమితిని పెంచుతూ ఇచ్చిన జి.ఓ.175 ఆర్థిక శాఖ, తేదీ:15.5.2010. ప్రకారము 13,360....38,570 స్కేలులో గాని, అంతకంటే తక్కువ స్కేలులో గాని వేతనం పొందువారికి మాత్రమే పండుగ అడ్వాన్సు రూ.3000/- పరిమితితో చెల్లించబడుతుంది. మీరు పొందుచున్న 16 సంవత్సరముల స్కేలు, 14,860.... 39,540 పెద్దది గనుక మీ దరఖాస్తును తిరస్కరించుట సమంజసమే.

4. ఒక రిటైర్డ్‌ ఉద్యోగి కుమార్తె యొక్క భర్త చనిపోవడం వలన ఆమె తన తండ్రి సంరక్షణలో ఉంటున్నది. సదరు రిటైర్డ్‌ ఉద్యోగి తదనంతరము ఆమె కుటుంబ పెన్షన్‌ పొందాలంటే ఇప్పుడే ఏమైనా పత్రములను అధికారులకు ఇవ్వవలసి ఉంటుందా? ఎస్‌.భాస్కర్‌రావు, అశ్వారావుపేట, ఖమ్మంజిల్లా.

సాధారణంగా కుటుంబ సభ్యుల జాబితాను పెన్షన్‌ దరఖాస్తుతో పంపి ఉంటారు. భర్త చనిపోయిన తన కుమార్తె తనపైనే ఆధారపడి జీవిస్తున్నదని సదరు పెన్షనర్‌ ట్రెజరీ అధికారులకు ఒక డిక్లరేషన్‌ను ఇవ్వవచ్చును. అందువలన భవిష్యత్తులో ఆమెకు ఉపయోగకరంగా ఉంటుంది.

5. మొదట ఎస్‌జిటిగా నియామకం పొందిన వారికి 1997లో కొందరు ఎం.ఇ.ఓ.లు, సర్వీసు రెగ్యులరైజేషన్‌ చేశారు. తదుపరి 2002లో స్కూల్‌ అసిస్టెంటుగా ప్రమోషన్‌ పొందిన వారికి రెగ్యులరైజేషన్‌ చేయు సందర్భములో డి.ఇ.ఓ. ఆఫీసువారు, ఎం.ఇ.ఓ.లు చేసిన రెగ్యులరైజేషన్‌ చెల్లదని అభ్యంతరం తెలిపారు. వారి అభ్యంతరం సరియైనదైతే పరిష్కార మార్గం ఏమిటి? ఆర్‌.వి.రావు. విశాఖపట్నం.

నియామక అధికారికే సర్వీసు రెగ్యులరైజేషన్‌ చేయు అధికారం ఉంటుంది. కనుక ఎం.ఇ.ఓలు చేసిన రెగ్యులరైజేషన్‌ చెల్లుబాటు కాదు. అందుచే ఎం.ఇ.ఓ.లు సదరు ఉపాధ్యాయుల యొక్క రెగ్యులరైజేషన్‌ చేసిన ఫైలులోని పోలీస్‌ యాంటిసిడెంట్స్‌ రిపోర్టును డి.ఇ.ఓ.లే తెప్పించుకొని, సదరు ఉపాధ్యాయుల యొక్క ఎస్‌జిటి క్యాడర్లో తిరిగి రెగ్యులరైజేషన్‌ను చేయటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.

1. ఒక ఉపాధ్యాయుడు ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో స్కూల్‌ అసిస్టెంట్‌గా సెలెక్టయ్యాడు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ప్రమోషన్‌ ఇచ్చుటలో తిరిగి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందా? ప్రమోషన్స్‌ ఇవ్వడంలో రోస్టర్‌పాయింట్‌ అమలు చేస్తారా, లేదా? బి. శంకర్‌రావు, పిఠాపురం, తూ.గో.

ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చు సందర్భంలో ఫీడర్‌ క్యాటగిరీ(కిందిపోస్టు)లోని సీనియారిటీ '' పరిగణనలోనికి తీసుకోబడుతుంది. అయితే ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్‌ వర్తింపజేయవలసి వున్నందున, ఫీడర్‌ క్యాటగిరీలోని జనరల్‌ సీనియారిటీతో సంబంధం లేకుండానే ప్రమోషన్‌ క్యాటగిరీలో వారి రోస్టర్‌ పాయింట్లు నిండే వరకు ప్రమోషన్లు కల్పిస్తారు. కాగా రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా బిసిలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ మొదలగు వారికున్న రిజర్వేషన్‌ ప్రమోషన్‌ సందర్భంలో వర్తించవు.

2. ఉద్యోగి రిటైరైనప్పటి నుండి జాప్యం లేకుండా పెన్షన్‌ పొందుటకు పెన్షన్‌ దరఖాస్తును ముందుగానే పంపుకోవచ్చుగదా? అట్టి పెన్షన్‌ దరఖాస్తును పంపిన తర్వాత మంజూరు కావలసియున్న వార్షిక ఇంక్రిమెంటును కూడా పెన్షన్‌ లెక్కింపునకు పరిగణించవచ్చునా? షేక్‌ రహమతుల్లా, జనగాం, వరంగల్‌జిల్లా

పరిగణించవచ్చు. ఈ విషయమై ప్రభుత్వ మెమో నెం.3670/482 /పెన్షన్‌-1/99 ఆర్థికశాఖ తేదీ 15.3.2000 ద్వారా వివరణ ఉత్తర్వులు ఇవ్వబడియున్నవి.

3. నేను టిటిసి అర్హతతో ఒక ఎయిడెడ్‌ పాఠశాలలోని అన్‌ ఎయిడెడ్‌ పోస్టులో తేదీ 6.11.79న నియామకం పొందాను. ఆ పోస్టుకు 1.6.1981 నుండి గ్రాంట్‌ -ఇన్‌ -ఎయిడ్‌ ఇవ్వడినది. అన్‌ ఎయిడెడ్‌ సర్వీసును తీసివేసి 24 సంవత్సరముల ఎస్‌పిపిస్కేల్‌-2ను 1.6.2005 నుండి మంజూరు చేశారు. ప్రస్తుతం 2010 పిఆర్‌సి స్కేళ్లలో వేతన స్థిరీకరణ చేయమని కోరగా- హెచ్‌ఎం టెస్ట్‌ పాస్‌కాకుండానే తీసుకొనిన 24 సంవత్సరముల స్కేలును రద్దు చేసి, రికవరీ చేయాలంటున్నారు. ఎం.ఎ. బి.ఇడి. అర్హతలతోపాటు 1990 మేలో ఎస్‌.ఒ టెస్టు పార్టు-1, డిఐ టెస్టులను పాసై ఉన్నాను. అయినా 24 సంవత్సరముల స్కేలును రద్దు చేయడం సమంజసమేనా? ఎస్‌.విజయరత్నకుమారి, నిడదవోలు, ప.గో.

ఎయిడెడ్‌ మరియు మున్సిపల్‌ యాజమాన్యములలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియామకమునకు బి.ఎ, బి.ఇడి అర్హతలతోపాటు హెడ్‌మాస్టర్స్‌, అకౌంట్‌ టెస్ట్‌ పాసై ఉండాలి. లేదా 45 సంవత్సరముల వయసు నిండిన వారైనా అయి ఉండాలి. కనుక తేదీ 1.6.2005 నాటికి మీ వయసు 45 సంవత్సరములు నిండి ఉండనిచో మీకు మంజూరైన ఎస్‌పిపి స్కేల్‌-2ను రద్దు పరిచి, మీకు 45 సంవత్సరముల వయసు నిండిన తేదీ నుండి తిరిగి మంజూరు చేయవలసి ఉంటుంది.

4. మా తండ్రి సర్వీసు పెన్షన్‌ తీసుకుంటూ 2005లో మరణించారు. అప్పటి నుండి మా తల్లికి కుటుంబ పెన్షన్‌ ఇస్తున్నారు. 60 శాతం వికలాంగుడనైన నేను మా తల్లి తర్వాత కుంటుంబ పెన్షన్‌ పొందుటకు అవకాశం ఉన్నదా? అవధానం నరసయ్య, నాయుడు పేట, నెల్లూరుజిల్లా

అవకాశం ఉన్నది. ఎపి రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్‌, 1980 నందలి రూల్‌ 51, సబ్‌రూల్‌-5లోని (I,II,III) అంశముల ననుసరించి వికలాంగులైన మీరు మీ తల్లి మరణానంతరం మీ జీవితాంతం కుటుంబ పెన్షన్‌ పొందవచ్చును.

 

 

—————

Back