శారీరక దండన లేకుండా బోధన సాధ్యంకాదా?

29/10/2010 23:43

 

 

 

శారీరక దండన లేకుండా బోధన సాధ్యంకాదా ? అనే ప్రశ్న ఈనాడు మన ఉపాధ్యాయులంతా తప్పని సరిగా వేసుకోవాల్సి వస్తుంది . ఎందుకంటే  ఇటీవల ఉపాధ్యాయులలో కొందరు , విద్యార్థులకు విధిస్తున్న శిక్షలు మానవతా పరిధిని దాటుతున్నాయి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం వారి పాల బడ్డ విద్యార్థుల దృష్టి లో ఉపాధ్యాయులను రాక్షసులుగా చూపిస్తోంది కాబట్టి .ఆ కొద్ది మంది చేసిన నిర్వాకం మీడియా సహకారంతో సమాజం ముందు ఉపాధ్యాయులందరినీ దోషులుగా నిలబెడుతోంది కాబట్టి.

            ఒక ఉపాధ్యాయుడు,ఆలస్య మైనందుకు విద్యార్థుల చేత 600 ల గుంజీలు తీయించాడు .గుజీలు తీసిన 40 మందీ హాస్పిటల్ పాలవడమే కాక అందులో 20 మందీ గుంజీలు తీస్తూనే స్పృహ తప్పి పడిపోయారు.ఇంతకూ వారు ఆలస్యమైంది కేవలం రెండు నిముషాలు. తరగతి గదిలో అల్లరి చేసినందుకు ఒక ప్రదానోపాధ్యాయురాలు 11 మంది విద్యార్థులకు పొయ్యిలో కాలుతున్న వంటచెరుకుతో వాతలు పెట్టారు.ఆడుకుంటూ ఎల్ కే జీ విద్యార్థులపై పడ్డారని మరొక ఉపాధ్యాయుడు బెత్తంతో 5 గురు విద్యార్థులను విచక్షణా రహితంగా కొట్టాడు .
          మొదటి సంఘటన ఆదిలాబాద్ ,మిగతా రెండు వరంగల్ లో జరిగాయి .మొదటి రెండూ ప్రభుత్వ పాఠశాలలు మూడవది ప్రైవేటు పాఠశాల  మొదటి సంఘటనా, మూడవ సంఘటనల్లో ఉపాధ్యాయులు పురుషులైతే రెండవ సంఘటనలో స్త్రీ .ఈ రకమైన ఘటనలలో  జిల్లాల ఎల్లలు లేవు .ప్రభుత్వ ప్రైవేటు తేడాలు లేవు .స్త్రీ పురుష భేదాలు కూడా లేవు .
          తరగతి గదిలో ఆడు కుంటున్నందుకు 16 ఏండ్ల అమ్మాయిని ఓ పంతులమ్మ చితగ్గొడితే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది .ఆవిడ  చేతిలోనే మరో ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కొల్పోయారట గతంలో .ఇవన్నీ చూసిన తర్వాతశారీరక దండన లేకుండా బోధన సాధ్యం కాదా అనే ప్రశ్న వేసుకోవాలనిపించడం లేదూ? నిజానికి దండనకు సంబంధించి కేవలం ఉపాధ్యాయుడిని మాత్రమే నిందించడం సరికాదని మనకు తెలుసు .దీనికి అనేక వ్యవస్థాగత ,సామాజిక ,కారణాలున్నాయి .ప్రభుత్వం గానీ, ప్రైవేటు యాజమాన్యం గానీ వ్యవస్థాగత కారణాలను ఏమాత్రం సరి చెయ్యక పోగా మరింత పెంచుతుంది .పాఠశాలలో తగినన్ని గదులు లేక పోవడం ,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తి సరిగా పాటించక పోవడం ,బండెడు సిలబస్ ,పుస్తకాల పంపిణీ లో తీవ్రమైన ఆలస్యం ,పరీక్షలకై పరుగులేత్తించడం ఇవన్నీ ఉపాధ్యాయుడిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి .ఆ ఒత్తిడి విద్యార్థికి దండన రూపంలో బదిలీ అవుతుంది .
         పిల్లలు అల్లరి చేయడం ,ఆడుకోవడం సహజమనే అధికారులే ,వారు ఏదైనా పాఠశాలను పర్యవేక్షణకు వెళ్లి నప్పుడు అంతా ప్రశాంతంగా ,నిశ్శబ్దంగా ఉంటే గొప్ప పాఠశాలగా కీర్తిస్తారు .వారిని అలా ఉంచేందుకు ఉపాధ్యాయులు ఏ పద్దతిని అనుసరిస్తున్నారో గమనించరు.ఒకటి కోరుకుంటూ ,మరొకటి చెప్పడం అధికారులకు అలవాటే .విద్యావేత్తలందరూ ర్యాంకుల కోసం గొంతులు కోసుకునే పోటీ సరైంది కాదని చెబుతూంటే ,రాజీవ్ విద్యా మిషన్ వారు తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారి ఫోటోలను నోటీసు బోర్డుపై ఉంచాలని ,సబ్జెక్టు  వారీ గ్రాఫును ప్రదర్శించాలనీ అతి పొడవైన గ్రాఫుకోసం ఉపాధ్యాయులను పోటీ పదమనీ చెబుతున్నారు . ఈ రకమైన ఫలితాలకోసం ఉపాధ్యాయులు దండనను ఆశ్రయించే అవసరాన్ని పెంచుతున్నారు.ఏది ఏమైనా విద్యార్థి తీవ్ర దండనకు గురైతే రిజల్ట్ కావాలనే ప్రభుత్వం గానీ తల్లిదండ్రులు గానీ ఉపాధ్యాయుడినే నిందిస్తారు .కాబట్టిశారీరక దండన లేకుండా విద్యార్థికి బోధించలేమా? 
అనేది ఉపాధ్యాయునికి సంబంధించినంతవరకూ ఒక మౌలిక ప్రశ్న అవుతుంది

 

 

—————

Back